లీటర్‌పై ఒకేసారి నాలుగు రూపాయలు పెరిగిన పాల ధర..!
నిత్యవసరాల ధరలు పెరుగుదల కారణంగా సామాన్యుడి జేబులకు చిల్లులు పడుతున్నాయి.
By Medi Samrat
నిత్యవసరాల ధరలు పెరుగుదల కారణంగా సామాన్యుడి జేబులకు చిల్లులు పడుతున్నాయి. తాజాగా లీటర్ పాల ప్యాకెట్ ధర రూ.4 పెరిగింది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయి. ఈ నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మంత్రి కె.ఎన్.రంజన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాల ధరలు లీటరుకు రూ.4 చొప్పున పెరుగుతాయన్నారు. పాడి రైతులు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
మీడియా కథనాల ప్రకారం.. పాల ధర లీటరుకు రూ.5 పెంచాలని సంస్థ డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం రూ.4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు నందిని పెరుగు ధర కూడా కిలోకు రూ.4 పెరిగింది. గతంలో జూన్ 2024లో కూడా నందిని పాల ధర లీటరుకు 2 రూపాయలు పెరిగింది. ధరల సవరణ సొమ్ము నేరుగా రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కెఎన్ రంజన తెలిపారు. ఇప్పుడు ఒక లీటర్ బ్లూ ప్యాకెట్ నందిని పాల ధర రూ.44 నుంచి రూ.48కి పెరగనుంది.
ఇదిలావుంటే.. నందిని మిల్క్ హర్యానాలో కూడా లాంచ్ చేయనున్నారు. దీనిని త్వరలో హర్యానాలో ప్రారంభిస్తామని కర్ణాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఇటీవల నందిని యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీకి విస్తరించింది.