ట్విట్టర్‌కు భారీ జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు
ట్విట్టర్ సంస్థకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2023 2:56 PM ISTట్విట్టర్‌కు భారీ జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు
ట్విట్టర్ సంస్థకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక కోర్టు తిరస్కరించింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య కేంద్రం పదిసార్లు ట్విట్టర్‌ను బ్లాక్ చేయాలని ఆదేశించినట్లు ట్విట్టర్ తన పిటిషన్‌లో పేర్కొంది. మరో 39 యూఆర్‌ఎల్స్‌ను కూడా తీసివేయాలని కేంద్ర ఐటీశాఖ ఆదేశించింది. ఆదేశాలను తప్పుబడుతూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దీక్షిత్ కొట్టిపారేశారు. ట్విట్టర్ సంస్థపై రూ.50 లక్షల జరిమానా కూడా విధించారు.
45 రోజుల్లోగా కర్ణాటక లీగల్ సెల్ సర్వీసెస్‌కు ఈ మొత్తం చెల్లించాలని కోర్టు ట్విట్టర్‌ను ఆదేశించింది. కేంద్ర ప్రభత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణ ట్విట్టర్ సంస్థ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ తెలిపారు. ట్విట్టర్ సంస్థ ఒక రైతు కాదు.. ఓ సాధారణ వ్యక్తి కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది. బిలినీర్ కంపెనీ అని.. సంస్థకు చట్టం తెలియదా అని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. తన తీర్పులో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను జస్టిస్ దీక్షిత్ సమర్ధించారు. ట్వీట్లను, అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 ప్రకారం భారత పౌరులకు లభించే భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను ఓ విదేశీ కంపెనీ క్లెయిమ్ చేయలేదని కర్ణాటక హైకోర్టు సూచించింది.