భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు..కర్ణాటక కోర్టు కీలక తీర్పు
భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులకు గురి చేసింది. ఈ కేసులో కర్ణాటక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 4:00 PM ISTభర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు..కర్ణాటక కోర్టు కీలక తీర్పు
భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులకు గురి చేసింది. భార్య వేధింపులను తట్టుకోలేక భర్త కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ క్రమంలోనే కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
కర్ణాటక హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. తాను నల్లగా ఉన్నానని తన భార్య రోజూ వేధిస్తోందని భార్య పిటిషన్ దాఖలు చేశాడు. విడాకులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ కేసులో విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. నల్లగా ఉన్నాడని భర్తను వేధించడం క్రూరత్వమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. నల్లగా ఉన్నాడని పదే పదే వేధించడం వల్లే భర్త తన భార్యను విడిచివెళ్లాల్సి వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు.. వేధింపులకు పాల్పడి తన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు భర్తపై భార్య లేనిపోని ఆరోపణలు కూడా చేసిందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. భర్తపై వివాహేతర సంబంధం ఆరోపణలు చేసినట్లు తెలిపింది. అక్రమంగా ఆరోపణలు చేయడంపై కోర్టు సీరియస్ అయ్యింది.
ఇలా వేధించడం క్రూరత్వమే అవుతుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12 (ఐ) (ఏ) ప్రకారం జంటకు విడాకులు జారీ చేసినట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరుకు చెందిన ఈ జంట 2007లో వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా ఉంది. అయితే.. 2012లోనే తనకు భార్య నుంచి విడాకులు కావాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. ఇదే కేసులో జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనంత రామనాథ్ హెగ్డేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
తాను విడాకులు తీసుకుంటే... భార్యను వదిలేస్తే తన కూతురు ఇబ్బంది పడుతుందని సదురు భర్త ఆలోచించాడని కోర్టు వ్యాఖ్యానించింది. భార్య ఎన్ని అవమానాలు పెట్టినా భరించాడని పేర్కొంది. రిటర్న్‌గా భర్తే తనని వేధించాడని భార్య కేసు పెట్టినా భర్త భరించాడని తెలిపింది. కేసు పూర్వపరాలు పరిశీలించాక, భార్య వాదనలను కూడా విన్నాకే తీర్పు వెల్లడించినట్లు కర్ణాటక హైకోర్టు చెప్పింది. వైవాహిక జీవితంలో కొనసాగేందుకు భార్యకు కూడా ఇష్టం లేదన్న విషయం గ్రహించామని కర్ణాటక కోర్టు తెలిపింది. దాంతో.. ఇరువురికి విడాకులు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.