కర్ణాటక ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఉచిత బియ్యంకు బ‌దులు డ‌బ్బులు

Karnataka Govt To Give Money Instead Of 5 Kg Additional Rice To BPL Families . కర్ణాటక ప్రభుత్వం అమలు చేయ‌ద‌లిచిన‌ అన్న భాగ్య పథకంపై కేంద్రం, సిద్ధరామయ్యకు మధ్య వాగ్వాదం

By Medi Samrat  Published on  28 Jun 2023 1:06 PM GMT
కర్ణాటక ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఉచిత బియ్యంకు బ‌దులు డ‌బ్బులు

కర్ణాటక ప్రభుత్వం అమలు చేయ‌ద‌లిచిన‌ అన్న భాగ్య పథకంపై కేంద్రం, సిద్ధరామయ్యకు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. కేంద్రం నుంచి సరిపడా బియ్యాన్ని సేకరించడంలో విఫలమైన నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బియ్యం దొరకని కారణంగా.. ఐదు కేజీల బియ్యం బదులు కుటుంబాల‌కు డ‌బ్బులు ఇవ్వాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. డబ్బు విడుదల తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చేందుకు పెద్ద మొత్తంలో బియ్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. దీంతో ప్ర‌భుత్వం కష్టాలను ఎదుర్కొంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఐదు కేజీల బియ్యంకు బదులు కేజీకి రూ.34 చొప్పున లబ్ధిదారులకు నగదు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సమావేశం అనంతరం కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్‌ మునియప్ప ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..'అన్న భాగ్యను ప్రారంభించే తేదీ (జూలై 1) వచ్చింది. ఈ రోజు మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, ఇతర మంత్రులు బియ్యం సరఫరా చేయలేనంత వరకూ (బీపీఎల్) రేషన్ కార్డుకు కిలోకు రూ.34 ఇద్దామ‌ని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక కార్డులో ఒకరు ఉంటే ఆ వ్యక్తికి అన్న భాగ్య యోజన కింద ఐదు కిలోల బియ్యంకు బదులు నెలకు రూ.170 అందజేస్తామని మంత్రి తెలిపారు. రేషన్ కార్డులో ఇద్దరు ఉంటే రూ.340, ఐదుగురు సభ్యులుంటే నెలకు రూ.850 అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని వెల్ల‌డించారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర‌ ప్రభుత్వం.. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ఎన్నికల హామీని తుంగలో తొక్కేందుకు కుట్ర పన్నిందని సిద్ధరామయ్య, ఆయన మంత్రులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేరకు జులై 1 నుంచి ‘అన్న భాగ్య’ పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన బియ్యం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (డొమెస్టిక్) కింద గోధుమలు, బియ్యం విక్రయాలను కేంద్రం నిలిపివేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్రం ఉచితంగా ఇచ్చే ఐదు కిలోల బియ్యంతో పాటు.. ప్రతి నెల అదనంగా ఐదు కిలోల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది.


Next Story