కర్ణాటకలో కరెంట్ ఆఫీస్‌లో మొసలిని వదిలి రైతుల ఆందోళనలు
కర్ణాటకలో వ్యవసాయానికి పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలంటూ రైతులు నిరసన చేస్తున్నారు.
By Srikanth Gundamalla
కర్ణాటకలో కరెంట్ ఆఫీస్‌లో మొసలిని వదిలి రైతుల ఆందోళనలు
కర్ణాటకలో రైతులు ఆందోళనలకు దిగారు. పలు చోట్ల రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు. ఎండు గడ్డి తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కనీసం ఐదు గంటలు కరెంటు అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయంటూ చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి సరపడా విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే పురుగుల మందులు తీసుకొచ్చి నిరసనలు తెలిపారు.
విజయాపూర్ జిల్లాలోని కొల్హార తాలూకా రోనిహాల్ హెస్కామ్ కరెంటు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే స్పందించి రైతులను అడ్డుకున్నారు. దాంతో.. ప్లాన్ విఫలం కావడంతో ప్లాన్-బి అమలు చేశారు రైతులు. ఒక వాహనంలో భారీ మొసలిని పట్టుకొచ్చారు. తాళ్లతో కట్టివున్న మొసలిని తీసుకెళ్లి కరెంట్ ఆఫీసులో వదిలేశారు. ఈ సంఘటనతో విద్యుత్ అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతలను అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు.. ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో.. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మొసలిని పట్టుకొని అక్కడి నుంచి తరలించారు. ఇలా రైతులు చేసిన వినూత్న నిరసన పోలీసులకు షాక్ ఇచ్చింది.
రైతులకు 5 గంటలపాటూ కోతలు లేని విద్యుత్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ వాస్తవంలో అధికారులు అలా ఇవ్వట్లేదు. కోతలు విధిస్తున్నారు. అందువల్లే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కరెంటు ఆఫీసుల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. రాత్రుళ్లు ఆలస్యంగా కరెంటు ఇస్తున్నారని, చీకట్లో పొలాలకు వెళ్లి నీరందిస్తే ఎలా అని రైతులు వాపోయారు. చీకట్లో జలచరాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు అంటున్నారు. దాంతో.. విద్యుత్ అధికారులకు కూడా ఇలాంటివి గుర్తు చేసేందుకు మొసలిని తీసుకొచ్చి ఈ చర్యకు పాల్పడినట్లు రైతులు చెప్పారు.
కర్ణాటకలో రైతుల ఆందోళనలు, వినూత్న రీతిలో నిరసనమొసలిని తెచ్చి కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు భయభ్రాంతులకు గురైన విద్యుత్ శాఖ ఉద్యోగులుకర్ణాటకలో కనీసం ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వట్లేదని రైతుల ఆందోళన pic.twitter.com/u6HAiuxBOG
— Newsmeter Telugu (@NewsmeterTelugu) October 21, 2023