ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీకెండ్ లాక్‌డౌన్ ఎత్తివేత
Karnataka Ends Weekend Curfew Night Restrictions Continue.దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 22 Jan 2022 1:57 PM ISTదేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దీంతో చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ ను విధించాయి. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో ఆంక్షలు సడలిస్తున్నాయి. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కృష్ణా అతిధి గృహంలో సీఎం బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది.
హోం శాఖ, ఆరోగ్యశాఖ, విద్యా శాఖ, జలవనరుల శాఖ మంత్రులు, బీబీఎంపీ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని రెవెన్యూ శాఖ మంత్రి అశోక్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల(జనవరి) ఆరంభం నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నాయి, ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. వారాంతపు కర్ఫ్యూతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
నిపుణులతో అన్నీ అంశాలు చర్చించిన తరువాత వీకెండ్ లాక్‌డౌన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో రాత్రి కర్ఫ్యూ మాత్రం ఈ నెల చివరి వరకు ఉంటుందని స్పష్టం చేశారు. బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొనసాగుతాయని చెప్పారు. మిగిలిన ఆంక్షల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, జాతరలకు అనుమతి లేదని, పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికే అనుమతి ఉందన్నారు.