Karnataka Elections: బీజేపీకి మద్ధతుగా నటుడు బ్రహ్మానందం ప్రచారం
పలు గ్రామాల్లో ప్రముఖ తెలుగు హస్య నటుడు బ్రహ్మానందం గురువారం నాడు ఎన్నికల ప్రచారం చేశారు.
By అంజి Published on 5 May 2023 10:00 AM IST
Karnataka Elections: బీజేపీకి మద్ధతుగా నటుడు బ్రహ్మానందం ప్రచారం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నది. ఈ వారాంతంలో ప్రచారానికి తెరపడనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు అన్ని హామీలు ఇస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పలువురు సినీ ప్రముఖులు సైతం.. పలు పార్టీలకు మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపురా నియోజకవర్గంలోని పుర, గిడనహళ్లి, మంచెనహళ్లి, పోశెట్టిహళ్లి, కనగానగొప్ప, జోడి బొమ్మనహళ్లితో పాటు పలు గ్రామాల్లో ప్రముఖ తెలుగు హస్య నటుడు బ్రహ్మానందం గురువారం నాడు ఎన్నికల ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చిక్కబళ్లాపురా జిల్లా సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా తెలుగు వారే ఉన్నారు. ఈ నియోజక వర్గంలో తెలుగు సామాజికవర్గం ప్రధాన ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, మంత్రి డాక్టర్ కె.సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని బ్రహ్మానందం కోరారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారం లో నటుడు బ్రహ్మానందం.. చిక్ బళ్లాపూర్ బీజేపి అభ్యర్థి సుధాకర్ కి మద్దతుగా బ్రహ్మి ప్రచారంFULL VIDEO >>>https://t.co/hjfHT28JFK#brahmanandam #comedian #KarnatakaAssemblyElection #KarnatakaElections #BJP #NTVTelugu pic.twitter.com/nf8w1ibie8
— NTV Telugu (@NtvTeluguLive) May 4, 2023
తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు బ్రహ్మానందంను బీజేపీ రంగంలోకి దించింది. మంత్రి సుధాకర్‌తో మొదటి నుంచి పరిచయం, ఆయన డాక్టర్‌గా, మంత్రిగా చేసిన సేవలు తెలిసి ప్రచారానికి వచ్చానని బ్రహ్మానందం తెలిపారు. ''సుధాకర్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆయన నిజాయితీపరుడని, ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. అలాంటి నాయకులను ప్రోత్సహించాలి, కాబట్టి మీరందరూ ఓటు వేసి ఆయనను ఎన్నుకోవాలి'' అని బ్రహ్మి అన్నారు. బ్రహ్మానందం పట్టణంలో ఉన్నాడని తెలుసుకున్న స్థానిక ప్రజలు హాస్య రాజును చూసేందుకు ఎగబడ్డారు. బ్రహ్మానందం, మంత్రి సుధాకర్ మంచి స్నేహితులని, ప్రచారానికి మంత్రి బ్రహ్మీని అడగ్గా, టాలీవుడ్ నటుడు నో చెప్పలేకపోయారని కొందరు అంటున్నారు.