ఆలయం అపవిత్రమైందంటూ దళిత కుటుంబానికి భారీ జరిమానా.!
Karnataka Dalit family fined Rs 23000.ఓ వైపు ప్రపంచం కొత్త టెక్నాలజీతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే..
By అంజి Published on 22 Sept 2021 11:08 AM ISTఓ వైపు ప్రపంచం కొత్త టెక్నాలజీతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. భారత్‌లో కొన్నిచోట్ల మాత్రం ఇంకా కులం, మతం పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉంది. దేశంలో కులం పేరుతో కొందరు చేస్తున్న అరాచకాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ దళిత బాలుడు ఆలయంలో ప్రవేశించాడంటూ అగ్ర కులాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బాలుడి ప్రవేశంతో ఆలయం అపవిత్రమైందంటూ... ఆలయాన్ని శుభ్రం చేసేందుకు 23 వేల రూపాయాల జరిమానా విధించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా మియపురా గ్రామంలో ఈ నెల 4న జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మియాపుర గ్రామంలో చెన్నదాస కమ్యూనిటీకి చెందిన 30 కుటుంబాలు ఉంటున్నాయి. వారంతా దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అందులో ఓ నాలుగేళ్ల బాలుడు తన జన్మదినాన్ని పురస్కరించుకుని తన తండ్రితో కలిసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాడు. అయితే ఆ ఆలయంలో దళితులకు అనుమతి లేదు. బయటి నుండే ఆంజనేయ ఆలయంలోని దేవుడికి దండం పెట్టుకుని వెళ్లాలి. ఈ క్రమంలోనే దళిత వ్యక్తి దేవుడికి దండం పెట్టుకుంటుండగా.. తన కుమారుడు ఆలయం లోపలికి వెళ్లి వెనక్కి వచ్చాడు. ఈ విషయం ఆలయ పూజారుల ద్వారా అగ్ర కులాల వారికి తెలిసింది. దీన్ని పెద్ద తప్పుగా భావించిన అగ్రకులాల వారు ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఆలయం అపవిత్రం అయ్యిందని, ఆలయాన్ని శుభ్రం చేసేందుకు రూ. 23 వేల జరిమానా కట్టాలని ఆ బాలుడి తండ్రిని ఆదేశించారు. ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టి వెళ్లింది. దీంతో పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు రంగప్రవేశం చేసి.. గ్రామంలో చోటు చేసుకున్న వివాదంపై ఆరా తీశారు. గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని అగ్రకులాల ప్రజలను హెచ్చరించారు.