దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. కాగా.. ఇప్పటికే ఓ సారి కరోనా బారిన పడిన కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప మరోసారి ఆ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని సీఎం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'జ్వరంగా ఉండడంతో నేడు కరోనా పరీక్షలు చేయించుకున్నాను. అందులో నాకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నేను ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండండి' అని ట్వీట్ చేశారు.
గతేడాది ఆగస్టు 2న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మణిపాల్ ఆస్పత్రిలో తొమ్మిది రోజుల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇటీవలే ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. కాగా.. ముఖ్యమంత్రి ఇవాళ ఉదయం తన నివాసంలో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆరోగ్య మంత్రి కె సుధాకర్, బిబిఎంపి కమిషనర్ గౌరవ్ గుప్తా కూడా పాల్గొన్నారు