కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగనుంది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పలువురు విపక్ష నేతలను ఆహ్వానించింది. మిత్రపక్షాలు, తమకు అనుకూలంగా ఉండే పలు రాష్ర్టాల సీఎంలు, పార్టీల నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపింది. కర్నాటక ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో పాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత, సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య శనివారం నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 224 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. కొద్దిరోజుల ఉత్కంఠ అనంతరం మే 17న (బుధవారం) సిద్ధరామయ్య, కర్ణాటక నేత డీకే శివకుమార్ మధ్య సీఎం అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. కాంగ్రెస్ ఇప్పుడు బెంగళూరులో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆర్జేడీ తేజస్వీ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా 11 మంది అగ్రనేతలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి కొందరు బీజేపీయేతర ముఖ్యమంత్రులను ఆహ్వానించలేదు కాంగ్రెస్. వీరిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ఆహ్వానం పంపలేదు.