దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.110 దాటగా.. డీజిల్ కూడా రూ.100దాటింది. దీంతో వాహనదారులు వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఇంధన ధరలు పెరుగుతుండడంతో ఆ ప్రభావం నిత్యావసరాలపై కూడా పడుతోంది. దీంతో పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కర్ణాటక ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం శుభవార్త చెప్పారు. పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించి తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికల తర్వాత ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం బసవరాజ్ బొమ్మయ్ తెలిపారు.
ఆదివారం సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్ పన్నులను తగ్గించే ఆలోచన ఉందా..? అని ప్రశ్నించగా.. సీఎం బొమ్మయ్ స్పందిస్తూ అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఉప ఎన్నిక తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షచేస్తానని.. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే పన్నులు తగ్గించే అవకాశం ఉందన్నారు. ఆర్థిక శాఖ కూడా బొమ్మై దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం కూడా ఇంధన ధరలు పెరిగాయి. తాజా పెంపుతో బెంగళూరులో లీటరు పెట్రోలు రూ.109.37కు, లీటరు డీజిల్ రూ.100.37కి చేరింది.