దారుణం..పెన్ను చోరీ చేశాడని మూడో తరగతి విద్యార్థికి చిత్రహింసలు
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 4:06 AM GMTదారుణం..పెన్ను చోరీ చేశాడని మూడో తరగతి విద్యార్థికి చిత్రహింసలు
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిన్నారులు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. చిన్నారులకు తప్పుఒప్పుల గురించి చెప్పి.. సరైన దారిలో నడిపించాలి. కానీ.. తాజాగా ఓ ఆశ్రమ ఇంచార్జ్ అతి దారుణంగా ప్రవర్తించాడు. మూడో తరగతి విద్యార్థి పెన్ను చోరీ చేశాడని చిత్ర హింసలకు గురిచేశాడు. కర్ణాటకలోని రాయచూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తరుణ్ కుమార్, అరుణ్ అనే విద్యార్థులు రామకృష్ణ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే.. తరుణ్ మూడో తరగతి కాగా.. అరుణ్ కుమార్ ఐదో తరగతి. గత శనివారం విద్యార్థులంతా ఆడుకుంటూ ఉండగా తన పెన్ను పోయిందని అరుణ్ కుమార్ ఇన్‌చార్జ్ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశాడు. తరుణ్ దాన్ని దొంగిలించాడని చెప్పాడు. అంతే.. ఆగ్రహం వ్యక్తం చేసిన వేణుగోపాల్ చిన్నారి అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టాడు. అంతేకాదు.. తరుణ్‌ను ఓ గదిలో ఊడు రోజుల పాటు బంధించాడు. ఆ దెబ్బలకు చిన్నారి ముఖం మొత్తం వాచిపోయింది. ఆదివారం బాబు చూడటానికి వెళ్లిన తల్లి కుమారుడిని చూసి ఆందోళన వ్యక్తం చేసింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసింది.
ఇన్‌చార్జ్‌తో పాటు మరో ఇద్దరు కూడా తనపై దాడి చేశారని బాధిత విద్యార్థి చెప్పాడు. అంతేకాదు.. యాద్గిర్ రైల్వే స్టేషన్‌లో భిక్షాటన కూడా చేయించారని, తనకు డబ్బు రాలేదని చెప్పాడు. ఒక్క పెన్ను గురించే జరిగిందని బాధిత విద్యార్థి వాపోయాడు. తల్లిదండ్రులు తమ కొడుకుకి జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఏ పెన్నూ దొంగిలించలేదనీ.. ఆడుకుంటుడగా పెన్ను కింద పడిపోతే దాన్ని తీశాడని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇన్‌చార్జ్ వేణుగోపాల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.