కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్
224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వెలుపల
By అంజి Published on 10 May 2023 4:45 AM GMTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్
బెంగళూరు: 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వెలుపల పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోలింగ్‌లో భారీ ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాకముందే ప్రజలు కేంద్రాల వెలుపల బారులు తీరారు. పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కళకళలాడగా, ఓటింగ్ ప్రక్రియను సమన్వయం చేయడంలో సిబ్బంది బిజీబిజీగా కనిపించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అన్ని వర్గాల ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మరోవైపు రాష్ట్రంలోని రాజకీయ అగ్రనేతలు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. హవేరీ జిల్లాలోని షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓటు వేయడానికి ముందు అశోక్ నగర్‌లోని ఆంజనేయ (హనుమాన్) ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు.
ఉన్నత విద్య, ఐటీ, బీటీ శాఖల మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ కుటుంబసభ్యులతో కలిసి మల్లేశ్వరంలో ఓటు వేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ చిక్కబళ్లాపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తండ్రి, భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర తన భార్య, కుమార్తెతో కలిసి శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో ఓటు వేశారు. బెళగావి జిల్లాలోని యక్సంబ పట్టణంలో ముజరై, హజ్, వక్ఫ్ శాఖ మంత్రి శశికళ జోల్లె, ఆమె భర్త చిక్కోడి పార్లమెంట్ స్థానం నుండి ఎంపి అన్నాసాహెబ్ జోల్లె తమ ఓటు వేశారు. వీరి కుమార్తె ప్రియా జొల్లె, కుమారుడు బసవప్రసాద జోలె కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది.