ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  28 Jun 2024 9:20 AM IST
karnataka, accident, 13 dead, lorry, tempo,

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హవేరీలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని టెంపో వెనుకనుంచి ఢీకొట్టింది.

గుండెనహళ్లి క్రాస్‌ దగ్గర పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున లారీని నిలిపి ఉంచారు. దాన్ని చూసుకోకుండా టెంపో వేగంగా వచ్చి వెనకాల నుంచి ఢీకొట్టింది. టెంపో వేగంగా వచ్చి ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది.ఈ ఘటనలో టెంపోలో ఉన్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. కాగా.. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

కాగా..మృతులు షిమోగా జిల్లా భద్రతావతి తాలూకాలోని హోలెహోన్నూరు దగ్గర ఎమ్మిహట్టి గ్రామానికి చెందినవారుగా పోలీసులు చెబుతున్నారు. కలబురగి జిల్లాలోని చించోలి మాయమ్మను దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. చనిపోయిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు చెప్పారు. ఇక ప్రమాద స్థలాన్ని హవేరి ఎస్పీ అన్షుకుమార్ పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది టీటీ వాహనంలోంచి మృతదేహాలను బయటకు తీశారని, క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రమాదంలో ఒకేసారి 13 మంది చనిపోవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Next Story