రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత.. ఓ మహిళ మృతి
Kanpur woman dies in traffic hold up for President.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ పర్యటనలో
By తోట వంశీ కుమార్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్‌లో ట్రాఫిక్ ను నిలిపివేయడంతో.. ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అనారోగ్యంతో ఉన్న ఆ మహిళను ఆమె భర్త కారులో ఆస్పత్రికి తీసుకెలుతుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అఖిలభారత పరిశ్రమల సమాఖ్య కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగం చీఫ్ వందన మిశ్రా(50) ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు.
శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వాహనంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్రపతి రాక నేపథ్యంలో ట్రాఫిక్‌ను చాలా సేపు నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందులో వందన వాహనం చిక్కుకుంది. కాన్వాయ్ వెళ్లాక వందనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించారు. పోలీసులను ఎన్ని సార్లు బతిమాలినా వారు వాహనాన్ని పంపేందుకు అనుమతించలేదని, సకాలంలో ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే ప్రాణం దక్కేదని డాక్టర్లు అన్నట్లు మృతురాలి భర్త చెప్పాడు.
కాగా.. ఈ ఘటనపై కాన్పూర్ పోలీస్ చీఫ్ అసిమ్ అరుణ్ విచారం వ్యక్తం చేశారు. తమకు ఇది గుణపాఠమని, భవిష్యత్తులో ఇలా జరుగకుండా చర్యలు చేపడతామని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పిలుపుతో కాన్పూర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. బాధిత కుటుంబానికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. దీంతో అధికారులు శనివారం వందన మిశ్రా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్రపతి, పోలీసుల తరుఫున క్షమాణలు చెప్పారు. ట్రాఫిక్‌ను చాలా సేపు నిలివేసేందుకు బాధ్యులైన ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు.