లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను : కమల్ హాసన్ సంచ‌ల‌న నిర్ణ‌యం

2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ ప్రకటించారు.

By Medi Samrat  Published on  9 March 2024 4:51 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను : కమల్ హాసన్ సంచ‌ల‌న నిర్ణ‌యం

2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తరపున ప్రచారం చేసే విష‌య‌మై కమల్ హాసన్ శనివారం మాట్లాడారు. బదులుగా MNMకు రాజ్యసభలో ఒక సీటు (2025) ఇచ్చే విధంగా హామీ పొందిన‌ట్లు తెలుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పోటీ చేయడం లేదని కమల్‌హాసన్ మీడియాకు ఇచ్చిన ప్రకటనలో తెలిపారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమికి ప్రచారం చేస్తానని చెప్పారు.

2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డీఎంకే.. కాంగ్రెస్, విడుతలై చిరుతిగల్ కట్చి (విసికె), మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో సహా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటోంది. తమిళనాడు నుంచి 9 లోక్‌సభ సీట్లు, పుదుచ్చేరి నుంచి 1 సీటును డీఎంకే కాంగ్రెస్‌కు ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి రెండు పార్టీలు త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అంతకుముందు డీఎంకే, వీసీకే పార్టీ సీనియర్ నేతల సమావేశం జరిగింది. ఆ తర్వాత సీట్ల పంపకానికి ఇరు పార్టీలు అంగీకారం తెలిపాయి. చిదంబరం, విల్లుపురం లోక్‌సభ స్థానాల నుంచి వీసీకే పోటీ చేస్తుందని చెబుతున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం VCKకి రెండు సీట్లు ఇవ్వడానికి ముందే DMK ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లకు రెండు సీట్లు, MDMK కి ఒక సీటు ఇచ్చింది.

సీట్ల పంపకానికి ముందు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో కమల్ హాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కమల్ హాసన్ మాట్లాడుతూ.. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిగా పోటీ చేసింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గానూ ఆ పార్టీ 38 స్థానాలను గెలుచుకుంది.

Next Story