సీజేఐగా జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రమాణ స్వీకారం

Justice UU Lalit sworn in as 49th Chief Justice of India.భార‌త దేశ సుప్రీం కోర్టు 49వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2022 11:42 AM IST
సీజేఐగా జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రమాణ స్వీకారం

భార‌త దేశ సుప్రీం కోర్టు 49వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. శ‌నివారం ఉద‌యం రాష్ట్ర‌ప‌తి భ‌వన్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము ఆయ‌న చేత ప్ర‌మాణం చేయించారు. సీజేఐగా జ‌స్టిస్ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్ ఈ ఏడాది న‌వంబ‌ర్ 8 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్‌, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, త‌దిత‌రులు హాజరయ్యారు. సీజేఐగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో యూ యూ లలిత్ సీజేఐగా నియమితులయ్యారు.

1957 నవంబరు 9న జస్టిస్ యూయూ లలిత్ మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబర్‌ వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1986 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. త్రిపుల్‌ తలాక్‌ సహా, అనేక కీలక కేసుల తీర్పుల్లోనూ జస్టిస్ లలిత్ భాగస్వామి అయ్యారు. కేర‌ళ‌లోని శ్రీ ప‌ద్మ‌నాభ‌స్వామి ఆల‌యం నిర్వ‌హ‌ణ హ‌క్కు అప్ప‌టి రాజ‌కుటుంబానికి ఉంటుంద‌ని జ‌స్టిస్ యు యు ల‌లిత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది.

Next Story