సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం

Justice DY Chandrachud sworn in as 50th Chief Justice of India.సీజేఐగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 5:52 AM
సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం

సుప్రీంకోర్టు 50వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా(సీజేఐ)గా బుధ‌వారం జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న చేత భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ము ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌, లోక్ సభ స్పీక‌ర్ ఓం బీర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయ‌ల్‌, కిర‌ణ్ రిజిజు హాజ‌ర‌య్యారు. రెండేళ్ల పాటు అంటే 2024 న‌వంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సీజేఐ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. 44 సంవ‌త్స‌రాల క్రితం డీవై చంద్ర‌చూడ్ తండ్రి జ‌స్టిస్ య‌శ్వంత్ విష్ణు చంద్ర‌చూడ్ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా సుదీర్ఘ‌కాలం ప‌నిచేయ‌గా.. ఇప్పుడు ఆయ‌న కుమారుడు అత్యున్న‌త పీఠాన్ని అధిరోహించారు.

1959 న‌వంబ‌ర్ 11 జ‌స్టిస్ చంద్ర‌చూడ్ జ‌న్మించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేష‌న్, ఢిల్లీ యూనివ‌ర్సిటీ నుంచి ఎల్ఎల్‌బి పూర్తి చేశారు. 1983లో హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఎల్ఎల్ఎమ్ చేశారు. 1986లో హార్వ‌ర్డ్ నుంచే జురిడిక‌ల్ సైన్సెస్‌లో(ఎస్జేడీ) డాక్ట‌ర్ ప‌ట్టా పొందారు. 1998 నుంచి 2000 వ‌ర‌కు అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ప‌నిచేశారు. 2016 మే 13న సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తిగా ఆయ‌న ప‌దోత‌న్న‌తి పొందారు.

అయోధ్య భూ వివాదం కేసు, గోప్యత హక్కు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, ఆధార్ చెల్లుబాటు వంటి కేసులకు సంబంధించిన ధర్మాసనాల్లో ఉన్న ఆయ‌న అత్యున్న‌త న్యాయ‌స్థానం మైలురాయి తీర్పుల‌లో భాగం అయ్యారు.

Next Story