దేశ వ్యాప్తంగా ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు

ముస్లిం సమాజంలో శాంతి, సోదరభావ దినోత్సవాన్ని సూచిస్తూ ఈద్-ఉల్-ఫితర్ 2025 ను నేడు భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

By అంజి
Published on : 31 March 2025 10:37 AM IST

Eid-ul-Fitr celebrations, India, Ramzan

దేశ వ్యాప్తంగా ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు

హైదరాబాద్: ముస్లిం సమాజంలో శాంతి, సోదరభావ దినోత్సవాన్ని సూచిస్తూ ఈద్-ఉల్-ఫితర్ 2025 ను నేడు భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈద్ రాకను ధృవీకరిస్తూ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ఆనందకరమైన వాతావరణం ప్రారంభమైంది. అప్పటి నుండి, ప్రజలు మసీదులలో ప్రార్థనలు చేయడానికి, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడానికి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి గుమిగూడుతున్నారు. ఇది ప్రేమ, ఐక్యత, సామరస్యాన్ని సూచిస్తుంది. మత బంధాలను బలోపేతం చేస్తుంది. వేడుకల దృష్ట్యా, వివిధ నగరాల్లో భద్రతా చర్యలు పెంచబడ్డాయి.

భద్రతాపరమైన ఆందోళనల మధ్య పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు సీనియర్ అధికారులు, పోలీసులు, పారామిలిటరీ సిబ్బందితో కలిసి కవాతులు నిర్వహిస్తున్నారు. మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ప్రార్థనలు చేస్తూ, కలిసి మెలిసి జరుపుకుంటున్నారు. ప్రముఖ నాయకులు ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని ముస్లింలకు పీఎం మోదీ ఈద్‌ ఉల్‌ ఫితర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా అందరికీ ప్రేమ, శ్రేయస్సు సందేశాలను అందించింది.

రాజస్థాన్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. రంజాన్‌ రోజన జైపూర్‌లో ఈద్గా వద్ద ముస్లింలపై హిందువులు పువ్వులు చల్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌ ప్రతీక అని మరోసారి రుజువైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇతర దేశాలలో పండుగలు

ఆదివారం షవ్వాల్ నెలవంక కనిపించకపోవడంతో ఏప్రిల్ 1న ఈద్ అల్-ఫితర్ జరుపుకుంటామని న్యూజిలాండ్ ఇస్లామిక్ అసోసియేషన్స్ సమాఖ్య (FIANZ) హిలాల్ కమిటీ ధృవీకరించింది. సౌదీ అరేబియా, అనేక ఇతర మధ్యప్రాచ్య దేశాల నివాసితులు శనివారం షవ్వాల్ చంద్రుడిని చూసి ఆదివారం ఈద్-ఉల్-ఫితర్‌ను జరుపుకున్నారు.

Next Story