కోటి మంది యువతకు ఉద్యోగాలు.. విద్యార్థులకు రూ.10 లక్షల లోన్: నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
By అంజి Published on 23 July 2024 6:34 AM GMTకోటి మంది యువతకు ఉద్యోగాలు.. విద్యార్థులకు రూ.10 లక్షల లోన్: నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పీఎం ప్యాకేజీని ప్రకటించారు. దీనికి రూ.2 లక్షల కోట్లను కేటాయించారు. విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఉపాధి రంగం ఏదైనా తొలి నెల వేతనం కింద రూ.15 వేల నగదు బదిలీ ఇందులోకే వస్తుంది.
కేంద్ర బడ్జెట్ 2024 - 25లో భాగంగా విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకూ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం చేయనుంది. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పిస్తామని చెప్పారు. వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.
12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు, అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం చేస్తామన్నారు. కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేపడతామని వివరించారు. మినరల్ మిషన్ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఆఫ్‌షోర్ మైనింగ్‌కు నూతన విధానం తీసుకొస్తామన్నారు. సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలిపారు.