మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడ్డ బోగీలు

గత కొన్నాళ్లుగా ఇండియన్ రైల్వేలో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  30 July 2024 8:15 AM IST
Jharkhand, train accident, howrah csmt express,

మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడ్డ బోగీలు

గత కొన్నాళ్లుగా ఇండియన్ రైల్వేలో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దాంతో.. ప్రయాణికులు అసలు రైళ్లలో ప్రయాణించాలంటేనే ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా జార్ఖండ్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చక్రధర్‌పూర్‌ సమీపంలో ముంబైకి వెళ్తున్న హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది.దాంతో ప్రమాదం జరిగింది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ట్రైన్ పట్టాలు తప్పిందని ప్రయాణికులు, అధికారులు చెబుతున్నారు. అయితే.. ఈ సంఘటనలో ఏకంగా 18 బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోయి కనిపిస్తున్నాయి. ఈ సంఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. దాదాపు వంద మంది వరకు గాయాలు అయ్యాయని సమాచారం.

ఇక రైలు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారికి సాయం అందించారు. కాగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వ్యాగన్‌లను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రైల్వే సమాచారం ప్రకారం హౌరా నుంచి ముంబై వెళ్తున్న రైలు సోమవారం రాత్రి 11.2 గంటలకు టాటానగర్‌కు చేరుకోవాలని. చాలా ఆలస్యంగా 2.37 గంటలకు చేరుకుంది. 2 నిఇషాల తర్వాత ఆగిన తర్వాత స్టేషన్‌ చక్రధర్‌పూర్‌కి బయల్దేరింది. అయితే.. స్టేషన్‌కు చేరుకోకముందే ప్రమాదానికి గురైంది.


మరోవైపు బీహార్‌లో కూడా సోమవారం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సమస్తిపూర్ దగ్గర ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు దర్బంగ నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story