ట్రాక్టర్ నడపడమే ఆ యువతి చేసిన తప్పా..? ఊరి నుంచి బహిష్కరణ
Jharkhand girl runs a tractor in the field the panchayat pronounced the decree.తాము వంట గదికే పరిమితం కాదని
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2022 3:23 AM GMTతాము వంట గదికే పరిమితం కాదని ప్రపంచంతోనే పోటీ పడుతూ అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు మహిళలు. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కుటంబ భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్న ఓ యువతి వ్యవసాయం చేస్తోంది. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పొలాన్ని దున్నుతోంది. దీన్ని గమనించిన గ్రామస్తులు మహిళలు ట్రాక్టర్ నడిపితే చెడు జరుగుతుందని ఆ యువతిని గ్రామం నుంచి బహిష్కరించారు. దేశానికి స్వాత్రంత్యం వచ్చి 75ఏళ్లు పూర్తి అయ్యాయంటూ సంబరాలు చేసుకుంటుండగా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లా శివనాథ్‌పుర్ గ్రామంలో 22 ఏళ్ల మంజు ఒరన్ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. బీఏ మొదటి సంవత్సరం చదువుతూనే కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం చేయడం ప్రారంభించింది. వ్యవసాయ పనుల కోసం పాత ట్రాక్టర్‌ను కొనుగోలు చేసింది. స్వయంగా పొలాన్ని దున్నుతోంది. దీన్ని గమనించిన గ్రామస్తులు.. మహిళలు ట్రాక్టర్ నడిపితే చెడు జరుగుతుందని, దీని వల్ల గ్రామంలో కరువు వస్తుందని, వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.
అంతేకాకుండా గ్రామ కట్టుబాట్లు మీరిందంటూ జరిమానా సైతం విధించారు. అయినప్పటికీ మంజు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన పని తాను చేసుకుంటూ పోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు మంజును గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తీర్మానాన్ని సైతం చేశారు. అయితే..ఈ తీర్మానాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను అని అంటోంది మంజు. వ్యవసాయం చేయడాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేసింది.