దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ రాజకీయ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శశికళ జైలు నుండి విడుదలవ్వగానే భారీగా తమిళనాడు రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని అనుకున్నారు. అయితే అది చోటు చేసుకోలేదు. కొద్దిరోజులు సైలెంట్ గానే ఉన్నారు శశికళ. ఇక ఎన్నికల్లో డీఎంకే కూడా దూకుడుగా ముందుకు వెళ్లి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక స్టాలిన్ పాలన గురించి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి చిన్నమ్మ తన మార్కు చూపించాలని భావిస్తూ ఉన్నారు.
శశికళ నేనొస్తున్నా అంటూ కేడర్‌ను ఉద్దేశించి ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు చిన్నమ్మ దూరంగా ఉండగా.. అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మళ్లీ తనకు అవకాశం దక్కిందని భావిస్తోంది. కేడర్ ను తన వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. తాజా ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్‌లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. చూస్తూ ఉంటే చిన్నమ్మ తమిళనాడు రాజకీయాల్లో తనదైన మార్కు చూపించాలని అనుకుంటోంది.