మైనింగ్‌కు అనుమతివ్వండి

Janardhan Reddy’s firm seeks SC permission to resume mining in Ballari. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్

By సునీల్  Published on  9 Aug 2022 10:59 AM GMT
మైనింగ్‌కు అనుమతివ్వండి

సుప్రీంలో ఓఎంసీ అభ్యర్థన

అభ్యంతరం లేదన్న ఏపీ ప్రభుత్వం

రేపు జరిగే విచారణపై ఉత్కంఠ

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్(ఓఎంసీ) వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ, కర్ణాటక సరిహద్దులోని బళ్లారికి చెందిన రాజకీయ నేత, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన సంస్థ ఓఎంసీ. 2009లో ఓఎంసీ చేస్తున్న మైనింగ్‌పై ఆరోపణలు రాగా.. 2010లో నిషేధిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ ప్రభుత్వం ఇచ్చిన మేరకు ఐరన్ ఓర్ తవ్వకాలు చేయాల్సి ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్న‌ వేల ఎకరాల్లో తవ్వకాలు జరిపిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టు, సీఈసీ, కేంద్ర ప్రభుత్వం, సీబీఐ విచారణలు జరిపాయి.

ఓఎంసీ హద్దులు దాటి తవ్వకాలు సాగిస్తుందన్న ఆరోపణలపై 2010లో సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదిక సమర్పించింది. ఓఎంసీ ఇచ్చిన అనుమతులు దాటి మైనింగ్ చేసిందని, కనుక భారీగా జరిమానా విధించాలని, సంస్థ నుంచి రికవరీ చేయాలని సూచించింది. అసలు ఎంత మేరకు హద్దులు దాటిందో నిర్ధారించేందుకు సుప్రీం విచార‌ణ‌కు ఆదేశించింది.

సరిహద్దుల విషయంపై సుదీర్ఘ తాత్సారం అనంతరం ఈ ఏడాది జూలై 21న కదలిక వచ్చింది. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రాష్ట్ర సరిహద్దుల వివరాలను ఇరు రాష్ట్రాలు ఆమోదించాయి. ఈ విషయాన్నే సుప్రీంలో ధ్రువీకరించాయి. ఓఎంసీ కేసులో వందల ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు న్యాయస్థానాల్లో నిరూపణ కాలేదు. గనులకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. మొత్తం 72 కేసులు నమోదవగా కోర్టు ఎక్కువ శాతం కేసులను కొట్టేసింది. తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి.

తాజాగా బళ్లారి రిజర్వ్ ఫారెస్టులో ఐరన్ ఓర్ మైనింగ్‌కు ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ తిరిగి సన్నాహాలు ప్రారంభించాలనుకుంటోంది. మైనింగ్‌ను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్లు గాలి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. మైనింగ్‌ను అనుమతించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఓఎంసీ తిరిగి మైనింగ్‌ను ప్రారంభించేందుకు తమకు అభ్యంతరమేం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. నిబంధనల ఉల్లంఘనతో 2010 నుంచి ఇప్పటి వరకు ఐరన్ ఓర్ మైనింగ్ జరపకుండా ఓఎంసీపై నిషేధం ఉంది. ఈ కేసుపై రేపు(బుధవారం, ఆగస్టు 10 సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలపకపోవడంతో ఓఎంసీకి అనుమతులు లభించే అవకాశాలున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎప్పుడేం జరిగింది?

-2009 ఏప్రిల్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు మైనింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు

-2009 మేలో సుప్రీం కోర్టులో పిటిషన్

-2009 ఆగస్టులో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి సుప్రీం నోటీసులు

-2009 నవంబర్లో మైనింగ్‌ను సస్పెండ్ చేయాలని సీఈసీ నివేదిక, సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

-2009 డిసెంబర్లో సీబీఐకి కేసు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టను ఆశ్రయించిన ఓఎంసీ.

-2010 జనవరిలో సీఈసీ నివేదికను పరిశీలించాని హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు

-అదే ఏడాది ఫిబ్రవరిలో స్టాప్ మైనింగ్ ఆదేశాలను క్వాష్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు. మార్చిలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే.

-సెప్టెంబర్‌లో మరో నివేదిక ఇవ్వాలని సీఈసీకి సుప్రీం ఆదేశాలు

-2011 ఏప్రిల్లో రెండో నివేదికను సమర్పించిన సీఈసీ

-పరిశీలన అనంతరం బళ్లారిలో మైనింగ్‌ను నిలిపివేస్తూ సుప్రీం ఆదేశాలు

-2017 డిసెంబర్లో ఏపీ- కర్ణాటక సరిహద్దులను నిర్ధారించాలంటూ 12 వారాల గడువు విధించిన సుప్రీం

-2022 జూలై 22న రాష్ట్రాల సరిహద్దుపై ఏకాభిప్రాయానికి వచ్చిన ఏపీ, కర్ణాటక,

-మైనింగ్ అనుమతులు కోరుతూ ఓఎంసీ వినతి. అభ్యంతరం లేదన్న ఆంధ్రప్రదేశ్

-2022 ఆగస్టు 10న సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ఓఎంసీ కేసు


Next Story
Share it