జనావాసాలు లక్ష్యంగా పాక్ దాడి..ఫైటర్ జెట్లను కూల్చివేసిన భారత్
పాకిస్తాన్ ఆర్మీ జనావాసాలే లక్ష్యంగా ఉరి సెక్టార్‌లో దాడులు చేసింది.
By Knakam Karthik
జనావాసాలు లక్ష్యంగా పాక్ దాడి..ఫైటర్ జెట్లను కూల్చివేసిన భారత్
పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. మే 6, 7 అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులు తీవ్రతరం చేసింది. దీనికి బదులుగా భారత్ పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలపై దాడులు జరిపింది. దీంతో లాహీర్లోని గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయినట్లు భారత సైన్యం గురువారం ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం తీవ్రం అయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ జనావాసాలే లక్ష్యంగా ఉరి సెక్టార్‌లో దాడులు చేసింది. పాక్ దాడులతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను లైట్లు ఆపి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
కాగా భారత్‌పై దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్‌కు చెందిన రెండు ఫైటర్ జెట్లను భారత సైన్యం కూల్చివేసింది. పాక్ చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం డెస్ట్రాయ్ చేసింది. పఠాన్ కోట్ సెక్టార్‌లో పాక్‌కు చెందిన ఈ ఫైటర్ జెట్‌ను కూల్చివేయగా, జలంధర్‌లో పాకి డ్రోన్లను సమర్థంగా భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. పాకిస్థాన్ జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్ము, పఠాన్‌కోట్, ఉదంపూర్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది.
కాగా ఈ దాడులను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లలోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు యత్నించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శత్రువుల నుంచి ముప్పును పసిగట్టిన వెంటనే, భారత సైన్యం నిర్దేశిత కార్యాచరణ నిబంధనలకు అనుగుణంగా ప్రతిస్పందించిందని, కైనెటిక్ (భౌతిక) మరియు నాన్-కైనెటిక్ (అభౌతిక) సామర్థ్యాలను ఉపయోగించి ఈ ముప్పులను తక్షణమే నిర్వీర్యం చేసినట్లు అధికారులు వివరించారు.
భద్రతా దళాల సత్వర ప్రతిచర్య వల్ల ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని, సైనిక ఆస్తులకు కూడా ఎటువంటి నష్టం కలగలేదని రక్షణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి భారతదేశం ఎల్లప్పుడూ పూర్తిగా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. సరిహద్దుల్లో ఎలాంటి దుందుడుకు చర్యలనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని రక్షణ వర్గాలు వ్యాఖ్యానించాయి.
#WATCH | J&K: Pakistan targets civilian areas in Uri sector. Visuals outside a hotel where Pakistani shells dropped.(Visuals deferred by unspecified time) pic.twitter.com/YcFHSxkXGt
— ANI (@ANI) May 8, 2025