జమిలీ బిల్లుకు టీడీపీ మద్దతు
జమిలి బిల్లుకు పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది.
By Kalasani Durgapraveen Published on 17 Dec 2024 3:06 PM ISTపార్లమెంట్లో జమిలీ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. కొత్త పార్లమెంట్ భవనంలో బిల్లుపై తొలిసారి ఓటింగ్ జరుగుతుంది. లోక్‌సభలో పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఓటింగ్ విధానాన్ని సభ్యులకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ వివరించారు.
బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పునకు సీఎం చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని తెలిపారు. జమిలీ ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జమిలీ ఎన్నికల నిర్వహణ వల్ల ఎన్నికల కమిషన్ ఖర్చు, రాజకీయ పార్టీల ఖర్చు తగ్గుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల కోసం పార్లమెంట్లో చట్టం చేయబోతోందని, దానిని అందరూ ఆమోదించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.