మెట్రో స్టేషన్‌లో గ్రాఫిటీ పెయింటింగ్.. జామియా యూనివర్సిటీ విద్యార్థి అరెస్టు
మండి హౌస్ మెట్రో స్టేషన్‌లో గ్రాఫిటీ వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు శనివారం ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 26 Jan 2025 2:34 PM ISTమెట్రో స్టేషన్‌లో గ్రాఫిటీ పెయింటింగ్.. జామియా యూనివర్సిటీ విద్యార్థి అరెస్టు
మండి హౌస్ మెట్రో స్టేషన్‌లో గ్రాఫిటీ వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు శనివారం ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న రాజీవ్ కుమార్ సింగ్‌గా గుర్తించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చట్టంలోని ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ (DPDP), భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. జనవరి 23న, రాజీవ్ కుమార్ సింగ్ రాత్రి 10 గంటల సమయంలో నల్ల రంగును ఉపయోగించి "PM EARTHWORMS ARE BETTER THAN YOU POPA" అని రాస్తూ సీసీటీవీ కెమెరాలకు చిక్కాడు.
వేగంగా స్పందించిన డిసిపి మెట్రో హరేశ్వర్ స్వామి నేతృత్వంలోని జాయింట్ పోలీసు బృందం అనుమానితుడిని గుర్తించడానికి సమీపంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలించింది. ఉత్తరప్రదేశ్ లో అతడిని పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. జనవరి 23న మండీ హౌస్‌లోని లలిత కళా అకాడమీలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్‌కు హాజరయ్యానని విచారణ సందర్భంగా నిందితుడు పోలీసులకు చెప్పాడు. రాత్రి 9:45 గంటల సమయంలో హౌస్ మెట్రో స్టేషన్‌కు చేరుకుని ఆవరణలోని గోడపై గ్రాఫిటీ రాశాడు. వానపాముల గురించిన ఒక కవితను తాను చదివానని, అదే తనలో ఇది రాయడానికి ప్రేరేపించిందని రాజీవ్ చెప్పారు. తరచూ రోడ్డు మీద ఉన్న పిల్లర్లు, ఇతర ప్రదేశాలపై డ్రాయింగ్లు వేస్తానని "POPA" పేరుతో తన గుర్తింపును వదిలివేసినట్లు అతను అంగీకరించాడు. రాజీవ్ కుమార్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని వజీరాబాద్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.