జహంగిర్‌పురి ఘటనపై సుప్రీం సీరియస్
Jahangirpuri demolition Supreme Court extends stay by two weeks.దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని జహంగీర్‌పురి
By తోట వంశీ కుమార్ Published on 21 April 2022 7:34 AM GMTదేశ రాజధాని ఢిల్లీ నగరంలోని జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూల్చివేతలు చేపట్టరాదని గురువారం ఆదేశించింది. బుధవారం జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలను ఉత్తర ఢిల్లీ నగరపాలక సంస్థ మేయర్‌కు తెలియజేసినప్పటికీ, కూల్చివేత చర్యలను ఆపకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
చట్ట విరుద్ధ ఆక్రమణలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ జమియత్ ఉలేమా-ఈ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. భవన నిర్మాణ వస్తువులు, స్టాల్స్, బడ్డీలు, కుర్చీలు, బల్లలు వంటివాటిని తొలగించేందుకు ముందుగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎన్డీఎంసీ మేయర్‌కు కూల్చివేత ఆపేయాలని ఆదేశాలు పంపినా, ఎలా నిర్మాణాల కూల్చివేత కొనసాగించారని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కూల్చివేతకు ముందు నార్త్ ఢిల్లీ మున్సిపాలిటీ ఏదైనా నోటిసు ఇచ్చిందా లేదా అన్న అంశాన్ని సమర్పించాలని కోర్టు కోరింది. కూల్చివేతలపై 'స్టేటస్ కో' (యధాతథ స్థితి) అమలు చేయాలని ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది.