దేశంలో అత్యంత ధనిక సీఎం జ‌గ‌న్‌.. ఎక్కువ అప్పులు ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..!

Jagan Mohan Reddy Richest CM in India, Mamata Banerjee Poorest. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

By M.S.R  Published on  12 April 2023 8:59 PM IST
దేశంలో అత్యంత ధనిక సీఎం జ‌గ‌న్‌.. ఎక్కువ అప్పులు ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..!

Jagan Mohan Reddy KCR



అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భారతదేశంలో అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘పేద సీఎం’గా నిలిచారు. భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించాక ఈ ప్రకటన వచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి 510 కోట్ల రూపాయల చర, స్థిరాస్తులు ఉన్నాయని తేలింది. దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రుల ఆస్తులన్నిటినీ కలిపినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ అత్యధికం.

మమతా బెనర్జీ నికర ఆస్తులు కేవలం రూ.15 లక్షలు మాత్రమే. ఆమె స్థిరాస్తులు సున్నా అని.. అంతేకాకుండా భారతదేశంలో కోటి రూపాయల లోపు ఆస్తులు కలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఆమెనే అని తెలిపారు. కేవలం కోటి రూపాయల ఆస్తులతో కేరళ సీఎం పినరయి విజయన్ ‘పేద సీఎం’ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

జగన్ మోహన్ రెడ్డి తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెము ఖండు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.163 కోట్లు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు రూ.63.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. నాగాలాండ్ సీఎం నెయిఫియు రియో ఆస్తుల విలువ రూ.46 కోట్లు, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామికి రూ.38 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు రూ.17 కోట్లు, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మాకు రూ.14 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు ఆస్తుల విలువ రూ.23.5 కోట్లు ఉన్నాయి.. ఆయనకు రూ.8.8 కోట్ల అప్పులు ఉన్నాయి. ఎక్కువ అప్పులు ఉన్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ తొలి స్థానంలో ఉండగా.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై రెండో స్థానంలో ఉన్నారు. బొమ్మై ఆస్తుల విలువ రూ.8.92 కోట్లు.. బొమ్మైకి రూ.4.9 కోట్ల అప్పులు ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కు రూ.11.6 కోట్ల విలువైన ఆస్తులు, రూ.3.75 కోట్ల అప్పులు ఉన్నాయి.


Next Story