నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1

ISRO successfully launches its new SSLV-D1 rocket.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త‌గా అభివృద్ధి చేసిన స్మాల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2022 4:36 AM GMT
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త‌గా అభివృద్ధి చేసిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకువెళ్లింది. చిన్న చిన్న ఉప‌గ్ర‌హాల‌ను త‌క్కువ దూరంలో ఉన్న క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టేందుకు ఈ వాహ‌క నౌక‌ను ఉప‌యోగించ‌నున్నారు. శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్‌(షార్‌) మొద‌టి లాంచ్‌పాడ్ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 రాకెట్ ను ఆదివారం ఉద‌యం 9.18 గంట‌ల‌కు ప్ర‌యోగించారు. ఈ వాహ‌క నౌక ఆ‌జా‌దీ‌శాట్‌తోపాటు ఈఓఎస్‌-02 ఉపగ్రహాలను మోసుకెళ్లింది.

ఈఓఎస్‌-02 ఉప గ్ర‌హం బ‌రువు 140 కిలోలు. ఇది మారుమూల ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీని అందించ‌డంలో సాయ‌ప‌డుంది. ఆజాదీశాట్ బ‌రువు 8 కిలోలు. దీన్ని 75 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు చెందిన 750 మంది విద్యార్థులు రూపొందించారు. 75వ స్వాత్రంత్య వార్షికోత్స‌వం, ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. దీని జీవిత కాలం ఆరు నెల‌లు.

ఇస్రో ఇప్పటి వరకు ఓ మోస్త‌రు, బ‌రువైన ఉప‌గ్ర‌హాల‌ను పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ వాహకనౌకల ద్వారా క‌క్ష్య‌లోకి పంపేది. చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉంటుంది. ఇది 10 నుంచి 500 కిలోల బ‌రువు ఉన్న వాణిజ్య ఉప‌గ్ర‌హాల‌ను స‌మీప భూక‌క్ష్య‌లో ప్రవేశ‌పెట్ట‌గ‌ల‌దు. దీన్ని త‌యారీ ఖ‌ర్చు రూ.30 కోట్లే.

Next Story