ISRO: నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. మరో రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

By అంజి  Published on  30 July 2023 2:45 AM GMT
Isro, PSLV C56, 7 foreign satellites, space

ISRO: నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. మరో రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇవాళ ఉదయం శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌) సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్‌ను ప్రయోగించారు. నిప్పులు చెరుగుతూ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్ దేశానికి చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహంతో పాటు మరో 6 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ సీరిస్‌లో ఇది 58వ ప్రయోగం. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ స్వయంగా పర్యవేక్షించారు.

పీఎస్ఎల్వీ రాకెట్ పొడవు 44.4 మీటర్లు, బరువు 228.642 టన్నులు. ఏడు ఉపగ్రహాల బరువు 422కిలోలు. 23 నిమిషాల్లో ప్రయోగం పూర్తి అయ్యింది. ప్రధానమైన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని 19.03 నిమిషాలు, మిగిలిన 6 ఉపగ్రహాలను రాకెట్ 3.30 నిమిషాల వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. డీఎస్‌-సార్‌ శాటిలైట్‌.. సింగపూర్‌ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను తీసి పంపిస్తుంది. ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్యం ఉపగ్రహ ప్రయోగం. ఇక రెండు వారాల్లో భారత అంతరిక్ష సంస్థ చేసిన రెండవ అతిపెద్ద ప్రయోగం ఇది. భారత్ గతంలో జులై 14న శ్రీహరికోట నుంచి చంద్రునిపైకి చంద్రయాన్-3 మిషన్‌ను ప్రయోగించింది.

ఇస్రో చైర్మన్‌ మాట్లాడుతూ.. పీఎస్‌ఎల్వీ-సీ 56 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. 7 శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్‌ చేర్చిందని వెల్లడించారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్‌ గవర్నమెంట్‌కి ధన్యవాదాలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్వీ ప్రయోగం ఉంటుందని తెలిపారు. గగన్‌యాన్‌, ఎస్‌ఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.

Next Story