ఇస్రో గూఢచర్యం కేసు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ISRO espionage case SC quashes Kerala High Court order granting anticipatory bail.1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో
By తోట వంశీ కుమార్
1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను ఇరికించారనే ఆరోపణల కేసులో మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సహా నలుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది. న్యాయమూర్తులు ఎంఆర్ షా, సి.టి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని తిరిగి హైకోర్టుకు బదిలీ చేస్తూ నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
క్రయోజనిక్ ఇంజిన్ తయారీకి సంబంధించిన కీలక పత్రాలను శాస్త్రవేత్త నంబి నారాయణ్ విదేశీయులను అప్పగించారంటూ 1994లో కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్నాళ్ల విచారణ తరువాత న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. క్రయోజనిక్ ఇంజిన్ పనులు ఆలస్యం కావాలన్న విదేశీ కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు నంబి నారాయణ్‌పై ఈ ఆరోపణలు చేశారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.
దీంతో అప్పటి గుజరాత్ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్, రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి పీఎస్ జయప్రకాశ్, కేరళకు చెందిన ఇద్దరు మాజీ పోలీసు అధికారులు ఎస్ విజయన్, తంపి ఎస్ దుర్గాదత్‌లపై సీబీఐ కేసులు పెట్టింది. అయితే.. కేరళ హైకోర్టు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళ హైకోర్టు తీర్పుపై సీబీఐ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిందితులకు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది.