సూర్యుడిపై గురిపెట్టిన ఇస్రో.. 'ఆదిత్య ఎల్‌1' ప్రయోగానికి ముమ్మర ఏర్పాట్లు

ISRO and NASA are planning to jointly launch Aditya L1 satellite in 2023 to study the Sun. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సమాయత్తం అయ్యింది. అమెరికా అంతరిక్ష

By అంజి  Published on  22 Aug 2022 5:18 AM GMT
సూర్యుడిపై గురిపెట్టిన ఇస్రో.. ఆదిత్య ఎల్‌1 ప్రయోగానికి ముమ్మర ఏర్పాట్లు

సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సమాయత్తం అయ్యింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కలిసి సూర్యుడిపై ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు.. 2023 జనవరిలో ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని గురించి ఇప్పటికే ఇస్రో, నాసాలు కలిసి చర్చించాయి. 2020లో జరగాల్సిన ఈ ప్రయోగం.. కరోనా కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ ప్రయోగం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయోగానికి పర్మిషన్ ఇచ్చింది.

2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ–సీ56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసిందని.. షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ వెల్లడించారు. బెంగళూరులోని య.ఆర్‌.రావు స్పేస్‌ సెంటర్‌లో ఈ శాటిలైట్‌ను రూపొందిస్తున్నారు. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్‌-1, చంద్రయాన్‌ -2, మార్స్‌పై పరిశోధనలకు మంగళ్‌యాన్‌-1 అనే మూడు శాటిలైట్లను తక్కువ వ్యయంతో పంపించి.. మొదటి ప్రయత్నంలో ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారు.

ఈ క్రమంలో ఇప్పుడు సూర్యుడి పైకి ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు. ఈ శాటిలైట్‌ 1,475 కిలోల బరువు ఉండనుంది. శాటిలైట్‌లో పేలోడ్స్‌ బరువు 244 కిలోలు కాగా, ద్రవ ఇంధనం బరువు 1,231 కిలోలుంటుంది. సూర్యుడి వైపు తీసుకెళ్లడం కోసం ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. తొలుత శాటిలైట్‌ను జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత శాటిలైట్‌ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బిందువు-1(ఎల్‌-1)లోకి చేరవేయనున్నారు. ఇందుకు 177 రోజుల సమయం పడుతుంది.

సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సౌర గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్న కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. దీనిపైన ఆదిత్య ఎల్‌-1 ద్వారా పరిశోధనలు చేయనున్నారు. అలాగే సౌర తుపాన్‌ సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు ఆటంక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఫొటో స్పియర్, క్రోమో స్పియర్‌లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story