న‌క్ష‌త్ర కోట గురించి మీకు తెలుసా?

Interesting facts about Manjarabad Star Fort. ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే

By అంజి  Published on  5 Sep 2022 5:08 AM GMT
న‌క్ష‌త్ర కోట గురించి మీకు తెలుసా?

ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. క‌ర్ణాట‌క‌లోని చిత్రమైన నక్షత్ర కోట గురించి విశేషాలు ఇవే..

నక్షత్ర కోట.. ఆకారాన్ని బట్టి దీన్ని ఇలా అంటారు కానీ.. నిజానికి దీని పేరు మంజ్రాబాద్‌ కోట. హస్సన్‌ జిల్లాలో ఉంది. 1792లో 3,241 అడుగుల ఎత్తైన కొండమీద కోటను కట్టించింది టిప్పుసుల్తాన్‌ అయినప్పటికీ.. కట్టింది మాత్రం ఫ్రెంచ్‌ ఇంజినీర్లు. వీరు యురోపియన్‌ శైలిలో దీన్ని నిర్మించారు. కోటగోడను గ్రానైట్‌ రాయితో దృఢంగా కట్టారు. లోపల ఉన్ననిర్మాణాలకు ప్రత్యేకమైన సున్నాన్ని వాడారు. కొన్నిచోట్ల కాల్చిన మట్టి ఇటుకలనూ ఉపయోగించారు.

థ్రిల్‌ చేసే సాహస యాత్ర

ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్‌పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. దీని మీద నుంచి చూస్తే చుట్టు పక్కల ప్రాంతాలన్నీ చక్కగా కనిపిస్తాయి. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది.


కోట ప్ర‌త్యేక‌త‌లు

ముచ్చెమటలు పట్టించే మండు వేసవిలోనూ ఈ కోటలోని గదులు చాలా చల్లగా ఉంటాయి. గోడలు మాములుగా కాకుండా కాస్త వాలుగా నిర్మించారు. ఇక నక్షత్ర ఆకారంలో కోట ఉండటం ఓ వింతైతే.. కోట మధ్యలో సరిగ్గా ప్లస్‌ ఆకారంలో ఓ బావి ఉండటం మరో విచిత్రం. దీనికి నాలుగు వైపులా మెట్లవంటి నిర్మాణాలున్నాయి. వేల అడుగుల ఎత్తున్న కొండపై ఉన్న ఈ బావిలో ఇప్పటికీ నీళ్లుండటం మరో వింత.

Next Story