బీహార్‌లో ముక్కు లేకుండా జన్మించిన శిశువు.. గ్రహాంతరవాసి అంటూ ప్రచారం
Infant born with rare deformity in Bihar's Motihari.బీహార్ రాష్ట్రంలో ముక్కు లేకుండా ఓ శిశువు జన్మించింది.
By తోట వంశీ కుమార్ Published on 15 Nov 2022 9:57 AM ISTబీహార్ రాష్ట్రంలో ముక్కు లేకుండా ఓ శిశువు జన్మించింది. ముక్కు స్థానంలో రెండు కళ్లు ఉన్నాయి. అలాగే చిన్న ట్రంక్‌లాగా పొడుచుకు వచ్చింది. అయితే.. శ్వాస తీసుకోవడానికి రంధ్రాలు మాత్రం లేవు. దీంతో ఈ వింత శిశువును కొందరు గ్రహాంతర వాసిగా ప్రచారం చేస్తుండగా మరికొందరు వినాయకుడు పుట్టాడని అంటున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి. అలీషేర్‌పూర్‌లో సరోజ పటేల్, రూపాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల రూపాదేవి ఓ బిడ్డకు జన్మిచ్చింది. ఆ శిశువుకు ముక్కు ఉండాల్సిన స్థానంలో వింత ఆకారంలో కళ్లు ఉన్నాయి. శ్వాస తీసుకోవడానికి రంధ్రాలు లేవు. దీంతో వైద్యులు ఆ శిశువుకు నోట్లో ఆక్సిజన్ పైపు పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువును చూసి జనాల్లో కొంత మంది వినాయకుడు అంటుండగా మరికొందరు మాత్రం గ్రహాంతర వాసి అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే.. వైద్యులు మాత్రం జన్యుపరమైన లోపాల కారణంగా క్రోమోజోమ్‌ల లోపాలతో ఇలాంటి శిశువులు జన్మిస్తారని అంటున్నారు.
దీనిపై గైనకాలజిస్ట్ డాక్టర్ హేమచంద్ర మాట్లాడారు. గర్భం దాల్చిన తరువాత మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉండే చాలా మంది మహిళలు గర్భం దాల్చిన తరువాత కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదన్నారు. అంగన్‌వాడీ సెంటర్స్‌తో పాటు ఎన్నో ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అయితే.. మహిళలలు అక్కడకు వెళ్లకుండా సాంప్రదాయ పద్దతులనే పాటిస్తున్నారని చెప్పారు. దీని వల్ల శిశువుకు అందాల్సిన పోషకాలు అందడం లేదని, జన్యుపరమైన లోపాలను గుర్తించడం కూడా కష్టం అవుతుందన్నారు. ఫలితంగా శిశువులు వింతగా పుడతారని, వీరు ఎక్కువ కాలం బతకడం కష్టం అని అన్నారు.