దేశంలో అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రి.. 500మందికి ఉచితంగా డయాలసిస్, భోజనం కూడా

India's biggest kidney dialysis hospital opened at Delhi. దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రి ఇటీవల అందుబాటులోకి వచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2021 3:44 PM IST
Indias biggest kidney dialysis hospital opened at Delhi

ప్రస్తుత రోజుల్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లయితే భారీగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే. చిన్న చిన్న జబ్బులకే వేలల్లో ఖర్చవుతుంటే.. పెద్ద పెద్ద జబ్బులు వస్తే లక్షల్లో ఖర్చు చేసుకోవాల్సిందే. కొన్ని సమయాల్లో అయితే ఉన్న ఆస్తులను సైతం అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కానీ ఢిల్లీలో మాత్రం ఓ ఆస్పత్రిలో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యం ఉచితంగా అందిస్తోంది. ఉచిత వైద్య అందించే ఆస్పత్రులు చాలా తక్కువగా ఉంటాయి. ఏ చిన్న వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే పరీక్షలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుంటాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రి ఇటీవల అందుబాటులోకి వచ్చింది. సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. రోజు 500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత డయాలసిస్‌ సౌకర్యం అందించేలా ఈ ఆస్పత్రిని నిర్మించారు. అయితే ఈ ఆస్పత్రిలో ఎటువంటి ఖర్చులు ఉండవు. అంతా ఉచితమే. 20 సంవత్సరాలకుపైగా మూతపడిన బాలాసాహిబ్‌ ఆస్పత్రిని గురుహరికృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ పేరుతో పునరుద్దరించి దేశంలోనే అతిపెద్ద కీడ్ని డయాలసిస్‌ ఆస్పత్రిగా మార్చారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు.

ప్రతినిత్యం 500 మందికి డయాలసిస్ చేసే విధంగా ఏర్పాట్లు

అలాగే ఏకకాలంలో 101 మందికి డయాలసిస్‌ చేసే విధంగా అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం 500 మంది డయాలసిస్‌ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 101 పడకలున్న ఈ ఆస్పత్రిని త్వరలో వెయ్యి పడకలకు పెంచే విధంగా ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అధ్యక్షుడు మంజిందర్‌సింగ్‌ సిర్సా వెల్లడించారు.

ఉచిత భోజన సౌకర్యం

అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో వైద్యంతో పాటు ఉచితంగా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆస్పత్రి నిర్వహణకు అవసరమయ్యే నిధులను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులు, వివిధ ప్రభుత్వ పథకాల నుంచి సమకూర్చుకుంటారు. అయితే దేశంలో కిడ్నీ వైద్య రంగంలో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ల సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.


Next Story