కెనడాలో గత మూడు రోజులుగా కనిపించకుండా పోయిన 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని ఒట్టావాలోని తన కళాశాల సమీపంలోని బీచ్‌లో మృతి చెందిందని కెనడాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ధృవీకరించింది. పంజాబ్‌లోని డేరా బస్సీకి చెందిన స్థానిక ఆప్ నాయకుడి కుమార్తె వంశిక ఏప్రిల్ 25న అదృశ్యం కావడంతో, భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక. ఆమె రెండేళ్ల క్రితం పైచదువుల కోసం కెనడాకు వెళ్లింది. ఏప్రిల్ 25, శుక్రవారం రాత్రి అద్దె ఇంటిని వెతికేందుకు బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. రోజూ ఉదయాన్నే కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడే ఆమె మరుసటి రోజు కుటుంబసభ్యులకు ఫోన్ చేయలేదు. దీంతో ఆందోళన చెందినవారు ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అక్కడి సన్నిహితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. ఈక్రమంలోనే ఆమె మృతదేహం బీచ్‌లో లభ్యమైంది. మృతికి గల కారణాలు తెలియరాలేదు.