మహమ్మారిపై పోరులో మేము సైతం అంటున్న ఇండియన్ నేవీ

Indian Navy Operation Samudra Setu II.ఆపరేషన్​ సముద్ర సేతు-2 పేరుతో విదేశాల నుంచి ఆక్సిజన్ క్రయోజనిక్​ కంటెయినర్లు సహా అనుబంధ వైద్య పరికరాలను యుద్దనౌకల ద్వారా భారత్​కు రవాణా చేయనుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2021 12:11 PM IST
Indian Navy Operation Samudra Setu II

దేశంలో ఆక్సిజన్​ కొరతను తీర్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఆపరేషన్​ సముద్ర సేతు-2 పేరుతో విదేశాల నుంచి ఆక్సిజన్ క్రయోజనిక్​ కంటెయినర్లు సహా అనుబంధ వైద్య పరికరాలను యుద్దనౌకల ద్వారా భారత్​కు రవాణా చేయనుంది. ఈ ఆపరేషన్‌ కింద.. లిక్విడ్‌ ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లు, అనుబంధ వైద్య పరికరాలను యుద్ద నౌకల ద్వారా నౌకాదళం రవాణా చేస్తారు.

వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నింపిన క్రయోజనిక్ కంటెయినర్లను తీసుకుని వచ్చేందుకు ఏడు యుద్ధ నౌకలను భారత్ రంగంలోకి దించింది. కోల్‌క‌తా, కొచ్చి, తల్వార్, త్రికండ్, తబర్, జలాశ్వ, ఐరావత్ పేర్లున్న యుద్ధ నౌకలను ఈ ఆపరేషన్ కోసం నియమించినట్టు కేంద్రం పేర్కొంది. ఇవన్నీ వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ను తీసుకుని ఇండియాకు రానున్నాయని అధికారులు వెల్లడించారు.

ఇందులో భాగంగా ఐఎన్ఎస్ తల్వార్ 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను మనామా, బెహరైన్ నుంచి, ఐఎన్ఎస్ కోల్ కతా యుద్ధ నౌక, దోహా నుంచి మెడికల్ ఉపకరణాలను తీసుకుని వచ్చేందుకు వెళ్లాయి. తూర్పు తీర ప్రాంతం నుంచి సింగపూర్ కు ఐఎన్ఎస్ ఐరావత్, అన్నీ వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళినపుడు అత్యవసరం ఎక్కడికి వెళ్లేందుకైనా సిద్ధంగా ఐఎన్ఎస్ జలాశ్వ ఉంటుందని తెలిపారు.

ఇక ఐఎన్ఎస్ కొచ్చి, త్రికండ్, తబార్ నౌకలను అరేబియా సముద్రంలో మోహరించి ఉంచామని, ఇవి దక్షిణ దేశాల నుంచి ఆక్సిజన్ ను తీసుకుని వస్తాయని, అవసరమైతే మరిన్ని యుద్ధ నౌకలను రెడీగా ఉంచుతామని నేవీ పేర్కొంది. కాగా, గత సంవత్సరం సముద్ర సేతు పేరిట తొలి ఆపరేషన్ ను ప్రారంభించిన ఇండియా, వందే భారత్ మిషన్ లో భాగంగా, పలు దేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 4 వేల మందిని స్వదేశానికి చేర్చింది.


Next Story