మత్స్యకారులపై ఇండియన్ నేవీ కాల్పులు
Indian Navy firing on Tamil Nadu fishermen. తమిళనాడులోని మైలాడుతురై నుంచి సముద్రంలోకి చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులపై భారత నౌకా దళం పొరపాటున
By అంజి Published on 21 Oct 2022 3:44 PM ISTతమిళనాడులోని మైలాడుతురై నుంచి సముద్రంలోకి చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులపై భారత నౌకా దళం పొరపాటున కాల్పలు జరిపింది. మైలాడుతురైకి చెందిన 10 మంది మత్స్యకారులు పవర్ బోట్‌లో రామనాథపురం దక్షిణ గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో చేపలు పట్టారు. ఆ సమయంలో గస్తీలో ఉన్న ఇండియన్ నేవీ పొరపాటున కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. కాల్పుల్లో గాయపడిన మైలాడుతురైకి చెందిన మత్స్యకారుడు వీరకుమార్‌ను భారత నావికాదళం రక్షించి చికిత్స నిమిత్తం రామనాథపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మధురై ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
డిఫెన్స్ ఫోర్స్ ప్రెస్ ఆఫీస్ అందించిన సమాచారం మేరకు.. ఈ ఉదయం బాగ్ చలషండి ప్రాంతంలో అనుమానాస్పద బోటును గుర్తించామని, అది అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం కావడంతో ఆ బోటుకు వార్నింగ్ ఇచ్చామని తెలిపారు. హెచ్చరించినా పడవ ఆగకపోవడంతో బోటుపై కాల్పులు జరిపారు. దీంతో పడవలో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఇండియన్ నేవీకి చెందిన చేతక్ హెలికాప్టర్ ద్వారా రామనాథపురం పంపించినట్లు నేవీ తెలిపింది. కాల్పుల ఘటనపై విచారణకు కూడా ఆదేశించారు.
భారత నావికాదళం కాల్పుల్లో గాయపడి మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడిని తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ స్వయంగా కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారుడు వీరవెల్లి శరీరంలోకి నాలుగు బుల్లెట్లు ప్రవేశించినట్లు సీటీ స్కాన్ లో తేలిందన్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. బుల్లెట్లు మత్స్యకారుడి కడుపు, తొడకు తగిలాయని మంత్రి అన్నారు.
మంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం.. కారైకల్ ప్రాంతం నుంచి 10 మంది మత్స్యకారులు పడవలో వెళ్లారు. వీరిలో ముగ్గురు కారైకాల్‌కు చెందినవారు, ఒకరు నాగపట్నంకు చెందినవారు, ఆరుగురు మైలాడుతురైకి చెందినవారు. వారు దక్షిణ గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో చేపల వేట సాగిస్తుండగా, భారత నౌకాదళానికి చెందిన సైనికులు వారిపై కాల్పులు జరిపారు. మన మత్స్యకారులపై మన నేవీ కాల్పులు జరపడం చాలా బాధాకరమని మంత్రి అన్నారు. దీనికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు.