రాకెట్‌లో స‌మ‌స్య‌.. జీఎస్ఎల్‌వీ ఎఫ్-10 ప్ర‌యోగం విఫ‌లం

Indian GSLV launch fails.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2021 8:11 AM IST
రాకెట్‌లో స‌మ‌స్య‌.. జీఎస్ఎల్‌వీ ఎఫ్-10 ప్ర‌యోగం విఫ‌లం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ(జియో సింక్రోన‌స్ శాటిలైట్ లాంచ్ వెఇహిక‌ల్) -ఎఫ్‌10 రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నింగికెగిసిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో రెండో ద‌శ త‌రువాత స‌మ‌స్య త‌లెత్తింది. రెండు స్టేజ్‌ల వరకు విజయవంతంగా నింగిలోకి వెళ్లిన రాకెట్‌ మూడో దశలో గతి తప్పింది. జీఎల్‌ఎల్‌వీ ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. క్ర‌యోజ‌నిక్ ద‌శ‌లో రాకెట్‌లో స‌మ‌స్య త‌లెత్త‌డంతో ప్ర‌యోగం విఫ‌ల‌మైంద‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ వెల్ల‌డించారు.

బుధ‌వారం ఉద‌యం 3.43 గంట‌ల‌కు ఈ వాహ‌క‌నౌక కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైంది. 26 గంట‌ల పాటు నిరంత‌రాయంగా కౌంట్‌డౌన్ కొన‌సాగిన త‌రువాత నెల్లూరులోని శ్రీహరికోటలో సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్‌ మూడో దశలో విఫలమైనట్లు కంట్రోల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ ద్వారా జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ ఉప‌గ్ర‌హాన్ని భూ ప‌రిశీల‌న కోసం ప్ర‌యోగించారు. నీటివ‌న‌రులు, పంట‌లు, అడ‌వులు, హిమానీన‌దాలు, స‌రిహ‌ద్దుల్లో అంచ‌నా త‌దిత‌రాల గురించి ఇది నిరంత‌రం స‌మాచారం అందించాల్సి ఉంది. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను ఈ ఉప‌గ్ర‌హం ద్వారా ముందే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. కాగా.. రాకెట్‌లో స‌మ‌స్య కార‌ణంగా ఈ ప్ర‌యోగం విఫ‌లం అయ్యింది. నిజానికి ఈ ప్ర‌యోగం గ‌తేడాది మార్చిలోనే చేప‌ట్టాల్సి ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి, సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

Next Story