జరిగిన అవమానంతో దేశం దుఃఖించింది: ప్రధాని మోదీ
India Was Saddened By Insult To Tricolour On Republic Day. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతానికి జరిగిన అవమానం చూసి దేశం దుఃఖించింది
By Medi Samrat Published on 31 Jan 2021 5:00 PM ISTగణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతానికి జరిగిన అవమానం చూసి యావత్ దేశం దుఃఖించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతానికి జరిగిన అవమానం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని సంస్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల గురించి, దానితో సంబంధం ఉన్న సంఘటనల గురించి పుస్తకాలు రాయాలని మన్‌కీ బాత్ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. ఈ ఘటనలు రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.
2020 ఏడాది దేశం ఎంతో సంయమనాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించి అనేక సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేసిన యుద్ధం ప్రపంచానికి ఒక ఉదాహరణగా ఆయన చెప్పారు. కొత్త ఏడాదిలో కూడా అదే తరహాలో ముందుకు సాగాలని ప్రధాని పిలుపునిచ్చారు. సంక్షోభ పరిస్థితుల్లో భారత్ ప్రపంచానికే ఆశాజ్యోతిగా మారిందన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమమే ఇందుకు నిదర్శనమని అన్నారు. 15 రోజుల్లోనే 30 లక్షల మందికి టీకా అందించి భారత్ రికార్డు సృష్టించిందని అన్నారు.
ఔషధాలు, వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ది సాధించిందన్నారు. భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్‌లు దేశ ఆత్మ నిర్భర్ భారత్, ఆత్మ విశ్వాసానికి ప్రతీకలుగా మోడీ అభివర్ణించారు. దేశంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లను ఇతర దేశాలకు కూడా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఆసీస్ గడ్డపై భారత క్రికెటర్లు సత్తా చాటారని, సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమిండియా.. తిరిగి పుంజుకుని విజయకేతనం ఎగురవేసిన తీరు స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు.