మధ్యప్రాచ్యంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్-డీజిల్ ధరలు ఎక్కడ పెరిగిపోతాయోనని ప్రజలు భయపడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశం వద్ద సుమారు 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇంధన లభ్యత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రణాళికలేవీ ప్రభుత్వం వద్ద లేవని స్పష్టం చేశారు అధికారులు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా చమురు సరఫరా, ధరలపై అనుమానాలు తారా స్థాయికి చేరిన తరుణంలో ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేసింది.