భయపెడుతున్న ఫంగస్

fungus cases in India. ఓ వైపు కరోనా మహమ్మారితో ఎన్నో ఇబ్బందుకు పడుతూ ఉండగా.. మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  24 May 2021 8:59 AM GMT
భయపెడుతున్న ఫంగస్

ఓ వైపు కరోనా మహమ్మారితో ఎన్నో ఇబ్బందుకు పడుతూ ఉండగా.. మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు గుంటూరు జిల్లా వారు కాగా, ఒకరు కర్నూలుకు చెందిన వారు. కర్నూలు జిల్లా నాగులాపురానికి చెందిన కేవీ ప్రసాద్ (68) ఈ వ్యాధి బారినపడి మృతి చెందారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణా జిల్లాకు చెందిన చింతా వెంకటేశ్వరరావు (64) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన కట్టా సాంబయ్య (55) వారం రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రకాశం జిల్లాలో నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 36 మందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. వీరిలో 20 మంది ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురికి అత్యవసర ఆపరేషన్ అవసరం కావడంతో విజయవాడ, హైదరాబాద్ తరలించారు. క‌రోనా సోకి స్టెరాయిడ్ థెర‌ఫీ తీసుకున్న వారిలో, మ‌ధుమేహం అదుపులోని లేని వారిలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు నిర్ధార‌ణ అవుతున్నాయి.

బ్లాక్ ఫంగస్ మాత్రమే కాకుండా వైట్ ఫంగస్ కూడా సోకుతోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ వ్య‌క్తికి బ్లాక్ ఫంగ‌స్‌తో పాటు వైట్ ఫంగ‌స్ కూడా ఒకేసారి సోకింది.గ్వాలియ‌ర్‌లోని ఓ రోగిలో ఈ ఫంగ‌స్‌ల‌ను గుర్తించారు. దేశంలో ఈ త‌ర‌హా కేసు న‌మోదు కావ‌డం ఇదే మొట్ట‌మొద‌టి సారి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు బ్లాక్ ఫంగ‌స్‌ను అంటువ్యాధుల నిరోధ‌క చ‌ట్టం కింద మ‌హ‌మ్మారిగా గుర్తించాయి.

కరోనా రోగుల్లో గ్యాంగ్రీన్ ను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు. ఓ శరీర భాగానికి రక్తం సరఫరా చేసే నాళాలు మూసుకుపోయినప్పుడు, ఆ భాగానికి ప్రాణవాయువు, ఇతర పోషకాలు అందక అక్కడి కణజాలం నశిస్తుందని నిపుణులు తెలిపారు. ఆ మృత కణజాలం కారణంగా ఆ భాగమంతా నీలం రంగు లేదా నలుపు రంగులోకి మారుతుంది. దీన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అని పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అనేకమంది రోగులు హార్ట్ అటాక్ తో మరణిస్తున్నారు. అందుకు కారణం కరోనా వైరస్ కారణంగా రక్తం గడ్డలు కట్టడమేనని చెబుతున్నారు. ఈ విధంగా రక్తం గడ్డలు కట్టడం వల్ల గ్యాంగ్రీన్ కూడా సంభవిస్తుందని వైద్యులు అంటున్నారు. రక్త ప్రసరణ నిలిచిపోయి ఆయా భాగాలు కృశించిపోతాయని, సకాలంలో గుర్తించకపోతే ఈ పరిస్థితి మరణాలకు దారితీస్తుందని తెలిపారు.


Next Story
Share it