దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దాదాపు 196 రోజుల తరువాత వెయ్యిలోపు కేసులు నమోదు అయ్యాయి. నిన్న 63,786 నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 862 కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24గంటల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,28,980కి చేరింది.
నిన్న 1,503 మంది కోలుకోగా ఇప్పటి వరకు 4,40,93,409 మంది ఈ మహమ్మారిని జయించారు. ప్రస్తుతం దేశంలో 23,791 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.35 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 23,791 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.56 కోట్ల డోసులను పంపిణీ చేశారు.