దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,16,179 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 8,582 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,22,017 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,761కి చేరింది.
నిన్న 4,435 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,52,743కి చేరింది. ప్రస్తుతం దేశంలో 44,513 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.68 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.71శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,95,07,08,541 మందికి డోసులను పంపిణీ చేశారు.