దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 40 శాతం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,40,615 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 7,240 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,97,522 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,723 కి చేరింది.
నిన్న 3,591 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,40,301కి చేరింది. ప్రస్తుతం దేశంలో 32,498 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.71 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.13శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న15,43,748 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,94,59,81,691 డోసులను పంపిణీ చేశారు.