పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లు, ఆంక్షల ఫలితంగా దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి కేసులు లక్షకు దిగువనే నమోదు అవుతుండడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 14,92,152 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 70,421 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,921 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,74,305కి పెరిగింది. నిన్న 1,19,501 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,81,62,947 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9,73,158 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.43 శాతానికి పెరిగింది. క్రియాశీల రేటు 3.30శాతానికి తగ్గింది.దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 25,48,49,301 టీకా డోసులు అందించారు.