దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికి.. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. గడిచిన 24 గంటల్లో 19,55,525 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 42,766 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,206 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,07,145 కి పెరిగింది.
నిన్న 45,254 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,99,33,538 చేరింది. ప్రస్తుతం దేశంలో 4,55,033 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.20శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.19శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 37.21 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.