దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 15,22,504 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 39796 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. ఇది ఆదివారం నాటి కంటే 7.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే మొదటిసారని పేర్కొన్నది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,85,229కి చేరింది.
నిన్న ఒక్క రోజే 723 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,02,728 కి పెరిగింది. నిన్న42,352 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,97,00,430కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,82,071 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.11శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ చెప్పింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 14,81,583 లక్షలు టీకాలు అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 35,28,92,046 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.