దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,57,383 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 39,726 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,14,331కి చేరింది. నిన్నటితో పోలిచ్చే కేసుల సంఖ్యలో దాదాపు 11శాతం పెరుగుదల కనిపించింది. నిన్న 154 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో వైరస్ కారణంగా మృత్యవాత పడిన వారి సంఖ్య 1,59,370కి చేరింది.
గడిచిన 24గంటల్లో 20,654 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటివరకు 1,10,83,679 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,71,282 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 3,93,39,817 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇక దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగం కంటే పైగా మహారాష్ట్రలోనే వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఆ రాష్ట్రంలో నిన్న 25,853 మంది కరోనా సోకకగా మొత్తంగా కేసుల సంఖ్య 23లక్షలు దాటింది. 58 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 53,138 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇక ఆ రాష్ట్రంలో ఇదే విధంగా కరోనా విజృంభన కొనసాగితే.. ఏప్రిల్ నాటికి క్రియాశీల కేసుల సంఖ్య మూడు లక్షలకు పైగా చేరుకుంటుందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.